వరంగల్ ఎంజీఎంలో పాము..పరుగులు తీసిన పేషెంట్లు

వరంగల్ ఎంజీఎంలో పాము..పరుగులు తీసిన పేషెంట్లు

వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి పాములకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఆసుపత్రిలోకి తరచుగా పాములు వస్తుండటంతో పేషెంట్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 14న ఆసుపత్రిలోని ఫీవర్ వార్డులో పాము ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. తాజాగా ఆసుపత్రిలోని పేషెంట్ బెడ్ కిందికి పాము వచ్చింది. పామును చూసిన పేషెంట్లు,  సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు. అనంతరం  ఎంజీఎం వైద్యాధికారులకు పిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి రప్పించారు. అతడు వచ్చి పామును పట్టి ఓ సంచీలో వేసి ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పాడు. దీంతో పేషెంట్లు, సిబ్బంది  సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో కూడా హాస్పిటల్ లోకి పాము వచ్చిందని పేషెంట్లు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎంజీఎం హాస్పిటల్ లో ఎలుకలు కొరికిన ఘటనలో ఓ పేషెంట్ మృతి చెందాడు. ఆ సమయంలో హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రస్తుతం వరుసగా ఆసుపత్రి లోపలకి పాములు వస్తుండటంతో సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.